: రెండో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె... జోరందుకున్న ‘ప్రైవేట్’ దోపిడీ
తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె రెండో రోజుకు చేరుకుంది. నిన్న ఉదయం 6 గంటలకు మొదలైన సమ్మె, నేడు మరింత తీవ్ర రూపం దాల్చనుంది. కార్మికులు ఎక్కడికక్కడ బస్సు డిపోల ముందు ధర్నాలు, ఆందోళనలకు దిగనున్నారు. తాత్కాలికంగా నియమితులైన సిబ్బందితో బస్సులను బయటకు తీయాలన్న సంస్థ యాజమాన్యం నిర్ణయానికి నిరసనగానే ఈ ఆందోళనలు చేయాలని కార్మికులు నిర్ణయించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కూడా తప్పేలా లేవు. ఇక ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్ ఆపరేటర్ల దందా మరింత మేర జోరందుకుంది. ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆపరేటర్లపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటైనా, అవి ఏమాత్రం సరిపోవడం లేదు. మరోవైపు సమ్మెకు చరమగీతం పాడేందుకు ప్రభుత్వం ఏమాత్రం యత్నించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంట్రాక్టు కార్మికులు నేటి మధ్యాహ్నంలోగా సమ్మెకు స్వస్తి చెప్పి విధుల్లో చేరాలని, లేని పక్షంలో వారిని సర్వీసు నుంచి తొలగిస్తామని సంస్థ ఎండీ నిన్న హుకుం జారీ చేశారు. దీనిపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నేటి మధ్యాహ్నం తర్వాత 3 గంటలకు అన్ని రాజకీయ పార్టీలతో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈయూ, టీఎంయూలు భేటీ కానున్నాయి. ఈ భేటీలో భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయం కానుందన్న వాదన వినిపిస్తోంది.