: ఈ భక్తులకు దేవుడు కనపడుతున్నాడు!
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు రవాణా సంస్థ కార్మికుల సమ్మె ప్రభావం తిరుమల భక్తులపై పెను ప్రభావాన్ని చూపుతోంది. అసలే వేసవి సెలవులు, పరీక్షల ఫలితాలు వెల్లడి కావడం, చిత్తూరు జిల్లాలో ఊరూరా మొదలైన గంగమ్మ జాతర తదితరాల నేపథ్యంలో ఈ సీజన్లో సాధారణంగానే బస్సులు కిటకిటలాడుతుంటాయి. సమ్మె కారణంగా ప్రయాణాలు చేయాల్సిన ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తిరుపతి నుంచి తిరుమల వెళ్లేందుకు భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏడుకొండలూ ఎక్కకముందే దేవుడు కనిపిస్తున్నాడని వాపోతున్నారు. తిరుపతి సప్తగిరి బస్ స్టేషన్ నుంచి తిరుమలకు బస్సులను నడపని ఆర్టీసీ అధికారులు అలిపిరి నుంచి మాత్రం కొన్ని బస్సులను తిప్పుతున్నారు. దీంతో బస్టాండు నుంచి అలిపిరి వరకూ చేరేందుకు ఆటోలను ఆశ్రయిస్తుంటే, యాత్రికులను దోచుకునే పనిలో ఆటో డ్రైవర్లు తలమునకలయ్యారు. మరోవైపు ప్రైవేటు టాక్సీలకు కూడా డిమాండ్ గణనీయంగా పెరిగింది.