: చప్పట్లు కొట్టి యూనిఫాం పరువు తీయద్దు: అధికారులతో ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్
యూనిఫాం వేసుకున్నప్పుడు చప్పట్లు కొట్టి పరువు తీయవద్దని సైన్యాధికారులకు ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ హితవు పలికారు. ఢిల్లీలో జరిగిన ఓ ఆర్మీ ఈవెంటులో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఔత్సాహిక అధికారులు చప్పట్లతో ప్రోత్సహించడం మొదలుపెట్టారు. దీంతో స్పందించిన ఆయన "నేను ప్రసంగం ముగించిన తరువాత మీరంతా చప్పట్లు కొట్టద్దు. ఇకపై మనమంతా యూనిఫాం వేసుకున్నప్పుడు పాటించాల్సిన మర్యాదను పాటించాలి" అని అన్నారు. వాస్తవానికి ఈ విషయాన్ని ప్రసంగానికి ముందే చెప్పాలని భావించానని, ఆపై మరచిపోయానని ఆయన వివరించారు. గత నెలలో జరిగిన కమాండర్స్ కాన్ఫరెన్స్ లో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రసంగించిన అనంతరం సభా ప్రాంగణం చప్పట్లతో మారుమ్రోగిందని గుర్తు చేసిన ఆయన యూనిఫాం వేసుకున్నప్పుడు ఈ తరహా చర్యలతో పరువు తీయద్దని సూచించారు.