: రాజ్యసభలో అమ్మా, అక్కా... మధ్యలో అన్న!
రాజ్యసభలో ఆసక్తికర సంవాదం చోటు చేసుకుంది. పంజాబ్ లోని మోగాలో బస్సులోంచి తల్లీకూతుళ్లను తోసివేసిన ఘటనపై వాడీవేడి చర్చ జరగ్గా, అందులో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సభ్యురాలు రేణుకా చౌదరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మధ్య సరదా సంభాషణలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ మోగా ఘటనను లేవనెత్తిన సందర్భంగా, వెంకయ్యనాయుడు లేచి మాట్లాడేందుకు యత్నించారు. విపక్షం ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకు యత్నిస్తోందన్నారు. ఇంతలో, కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా చౌదరి తమను కూడా మాట్లాడనివ్వాలని, తాము మాట్లాడేది వినాలని కోరారు. "ఆయన మేం మాట్లాడేది వింటున్నారా?" అని డిప్యూటీ చైర్మన్ ను ప్రశ్నించారు. అందుకు, వెంకయ్య అందుకుని "వీ వర్ లిజనింగ్ టు యూ అమ్మా" అని బదులిచ్చారు. దీంతో, రేణుక "అమ్మా ఈజ్ దట్ సైడ్ సర్, అయాం అక్క" అని పేర్కొన్నారు. ఆ వెంటనే వెంకయ్య రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ను "అమ్మ, అక్క పదాలకు తేడా తెలుసా అండీ?" అని అడిగారు. ఆయన ఆలోచిస్తుండగానే, అమ్మ అంటే మదర్ అని, అక్క అంటే సిస్టర్ అని వివరించారు. "అమ్మా" అనడంలో ఆప్యాయత ఉందని, తనకూ ఓ మనవరాలు ఉందని, ఆమెను "అమ్మా" అనే పిలుస్తానని తెలిపారు. "ఆ విధంగా నేను మీ పట్ల అనురాగం ప్రదర్శించాను రేణుకాజీ" అని వెంకయ్య అన్నారు. మధ్యలో సీతారాం ఏచూరి అందుకుని, ఆయన (వెంకయ్య)ను తాము "అన్నా" అని పిలుస్తామని, 'అన్న' అంటే 'ఎల్డర్ బ్రదర్' అని వివరించారు. మరి 'అన్న' అంటే అందరూ చెప్పేది వినాలని చమత్కరించారు. దీంతో, సభలో నవ్వులు విరబూశాయి.