: వచ్చే నెలలో బంగ్లాదేశ్ పై టీమిండియా దండయాత్ర
భారత క్రికెట్ జట్టు వచ్చే నెలలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళుతోంది. ఈ పర్యటనలో ఒక టెస్టు, 3 వన్డేలు ఆడుతుంది. టీమిండియా ఈ టూర్ కోసం జూన్ 7న బంగ్లాదేశ్ చేరుకోనుంది. జూన్ 10 నుంచి 14 వరకు తొలి టెస్టు జరుగుతుంది. వన్డే సిరీస్ లో భాగంగా జూన్ 18న తొలి వన్డే, 21న రెండో వన్డే, 24న మూడో వన్డే నిర్వహిస్తారు. ప్రతి వన్డే మ్యాచ్ కు రిజర్వ్ డే ప్రకటించారు. కాగా, ఏకైక టెస్టుకు ముందు భారత జట్టు ప్రాక్టీసు మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ఇక, బంగ్లాదేశ్ ఇటీవల కనబరుస్తున్న ఫామ్ విషయానికొస్తే, పాకిస్థాన్ పై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఆ సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకుని సత్తా చాటింది. అంతేగాదు, ఏకైక టి20 పోరులోనూ పాక్ ను చిత్తుచేసి అభిమానులను మరింత ఆనందంలో ముంచెత్తింది. టీమిండియా విషయానికొస్తే, వరల్డ్ కప్ తర్వాత ఐపీఎల్ లో ఆటగాళ్లందరూ బిజీగా ఉన్నారు. అలసట వారి ఆటపై ప్రభావం చూపొచ్చని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.