: పదేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ దంపతుల అరెస్ట్
పూర్వాశ్రమంలో ఆయనో న్యాయవాది. అనంతర కాలంలో మావోయిస్టుగా మారిపోయాడు. అతనిపై 20కి పైగా క్రిమినల్ కేసులున్నాయి. పదేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. వారే రూపేష్, ఆయన భార్య షైనా. దక్షిణాది నాలుగు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో వీరు పట్టుబడ్డారు. కోయంబత్తూరు సమీపంలోని ఓ గ్రామం వద్ద బేకరీలో కాఫీ తాగుతుండగా వీరిని అరెస్ట్ చేశామని కేరళ హోం శాఖ మంత్రి రమేష్ చిన్నితాల తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ పోలీసులంతా కలిసి వలపన్ని వీరిని అరెస్ట్ చేశారని, ఇది మావోలకు పెద్ద ఎదురుదెబ్బని అన్నారు. కేరళలో మావోయిస్టు కార్యకలాపాలకు వీరిద్దరే కీలకమని తెలుస్తోంది. వీరిద్దరూ దక్షిణ భారత రీజనల్ కమిటీ సమావేశాలకు వెళుతున్నారన్న సమాచారాన్ని అందుకుని అరెస్ట్ చేసినట్టు రమేష్ వివరించారు. కాగా, వీరితో పాటు కేరళకే చెందిన అనూప్, కర్ణాటకకు చెందిన వీరమణి, తమిళనాడుకు చెందిన కన్నన్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్నరాత్రి వీరంతా అరెస్ట్ కాగా, విచారణ నిమిత్తం కేరళకు తరలించినట్టు తెలుస్తోంది.