: ఇంటర్నెట్ ఆగిపోతుందా?...సాంకేతికత ప్రమాదం అంచున ఉందా?
సాంకేతిక సౌకర్యాలతో ఇంటి నుంచే ఎన్నో పనులు పూర్తి చేసుకుంటోంది ఆధునిక తరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని అరక్షణం కూడా ఊహించుకోలేము. ఇంటర్నెట్ తో జీవితాలు అంతగా ముడిపడిపోయాయి. ఒత్తిడి పెంచుకోవాలన్నా, తగ్గించుకోవాలన్నా ఏకైక మార్గం ఇంటర్నెట్ అనేలా యువతరం జీవితాలు సాంకేతిక వినియోగంతో పెనవేసుకుపోయాయి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ ఆండ్రూ ఎలిస్ బాంబు లాంటి అభిప్రాయం వెల్లడించారు. రోజురోజుకూ ఇంటర్నెట్ వినియోగం విస్తరిస్తోందని, దీని కారణంగా కేబుళ్లు, ఆప్టికల్ ఫైబర్ల సామర్థ్యం దెబ్బతింటోందని అన్నారు. ఎనిమిదేళ్లలో ఇంటర్నెట్ సామర్థ్యం నిండిపోయి, కుప్పకూలే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై లండన్ లోని రాయల్ సొసైటీ గత నెలలో ప్రపంచంలోని ప్రముఖ ఇంజనీర్లు, భౌతిక శాస్త్రవేత్తలు, టెలికం నిపుణులు, సంస్థలతో సమావేశం నిర్వహించింది. అందులో ప్రొఫెసర్ ఆండ్రూ ఎలిస్ పాల్గొన్నారు. టెక్నాలజీ విస్తరిస్తుండడంతో ఎక్కువ మంది, ఎక్కువ సామర్థ్యంతో ఇంటర్నెట్ వినియోగిస్తున్నారని, అందువల్ల ఒత్తిడి పెరిగిపోతుందని ఆయన వెల్లడించారు.