: కానిస్టేబుల్ ను చంపుతానన్న బీజేపీ ఎమ్మెల్యే... కేసు నమోదు
బీజేపీ నేత, హైదరాబాదులోని గోషా మహల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజా సింగ్ లోథా ఓ పోలీస్ కానిస్టేబుల్ పై విరుచుకుపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న ఆ కానిస్టేబుల్ పై దాడి చేయడమే కాక చంపేస్తానంటూ బెదిరించారు. దీంతో బాధిత కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళితే... మంగళ్ హాట్ పరిధిలోని బలరామ్ గల్లీలో నిన్న రాత్రి ఓ పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకకు రాజాసింగ్ తన అనుచరగణంతో హాజరయ్యారు. వేడుకలో భాగంగా డీజే సౌండ్ మరీ ఎక్కువగా ఉందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు అధికారుల ఆదేశాల మేరకు కానిస్టేబుల్ చంద్రశేఖర్ అక్కడికి చేరుకుని డీజేను ఆపేందుకు యత్నించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాజాసింగ్ కానిస్టేబుల్ ను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే దాడితో ఒక్కసారిగా షాక్ తిన్న కానిస్టేబుల్ ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి మంగళ్ హాట్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు.