: బై సిలికాన్ వ్యాలీ... జై ఇండియా! అమెరికా నుంచి తిరిగొస్తున్న మన నైపుణ్యం... ఈ-కామర్స్ విప్లవ పుణ్యమే!
రోజురోజుకూ పెరుగుతున్న ఈ-కామర్స్ రంగం పుణ్యమాని, అమెరికాలోని మన టాలెంట్ తిరిగి మాతృభూమికి చేరుతోంది. సంవత్సరాల తరబడి సిలికాన్ వ్యాలీకి అంటిపెట్టుకుపోయిన భారత సాంకేతిక నైపుణ్యం వెనక్కు రావడానికి 'స్టార్టప్' కల్చర్ పెరగడంతో పాటు యూఎస్ తో సమానంగా వేతనాలు వస్తుండడమే కారణం. భారత ఐటీ ఇండస్ట్రీపై అంతగా నమ్మకం లేక 70వ దశకం నుంచి తరలివెళ్లిన వారంతా మారిపోతున్నారు. స్వదేశానికి వచ్చి తమ సత్తా చాటాలని, అందుకు అవకాశాలు ఉన్నాయని భావిస్తూ, వెనక్కు వచ్చేస్తున్నారు. ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటి కంపెనీల పుణ్యమాని ఈ-కామర్స్ రంగం గత సంవత్సరంలో సుమారు రూ. 32 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 2013లో ఈ రంగంలోకి వచ్చిన నూతన పెట్టుబడుల విలువ రూ. 12.5 వేల కోట్ల రూపాయలే. సంవత్సరం వ్యవధిలో 150 శాతం మేరకు పెరిగిన పెట్టుబడులు భారత్ ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. తదుపరి దశ విస్తరణకు కొత్త టాలెంట్ అవసరమైంది. చాలా కంపెనీలు సిలికాన్ వ్యాలీలో ఇరుక్కుపోయిన ఇక్కడి వారికి వల విసురుతున్నాయి. అయితే, ఇప్పటివరకూ యూఎస్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చినవారి సంఖ్య తక్కువే అయినప్పటికీ, భారతీయుల మనసు మారుతోందనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. భారత కంపెనీలైన స్నాప్ డీల్, ఇన్ మొబై, జొమాటో వంటి కంపెనీలు గడచిన ఐదేళ్లలో 20 మంది చొప్పున సిలికాన్ వ్యాలీ ఉద్యోగులను ఏరికోరి ఇండియాకు తెచ్చుకున్నాయి. ఫ్లిప్ కార్ట్ ఇటీవల గూగుల్ కాలిఫోర్నియా కార్యక్రమంలో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ ఉద్యోగులను బెంగళూరు కార్యాలయానికి తీసుకువచ్చింది. వీరిద్దరికీ గూగుల్ ఇస్తున్న వేతనానికి రెట్టింపు ఇచ్చేందుకు ఫ్లిప్ కార్ట్ అంగీకరించినట్టు సమాచారం. వచ్చే మూడేళ్లలో ఫిప్ కార్ట్ లో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగుల వేతనాలు సాలీనా రూ. 6 కోట్లను దాటవచ్చని హైరింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. వేగంగా ఎదుగుతున్న కంపెనీల్లో చేరితే సులభంగా ఎదగవచ్చని, కంపెనీల్లో ఈక్విటీ వాటాలు తదితర ప్రోత్సాహకాలు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయని భావిస్తుండడం కూడా భారత నిపుణుల వెనక్కు వెళ్లాలన్న ఆలోచనకు మద్దతు తెలుపుతోందని భావిస్తున్నారు. తల్లిదండ్రులకు, బంధు మిత్రులకు దగ్గరగా ఉండవచ్చన్న ఆలోచన కూడా వారి మనసు మారుస్తోందని నిపుణులు అభిప్రాయపడ్డారు.