: కనీస మద్దతు ధరను పెంచితే ఇబ్బందులే: కేంద్రం
పంట దిగుబడిపై కనీస మద్దతు ధరను పెంచితే మరింత ఇబ్బందులు వస్తాయని కేంద్రం భావిస్తోంది. ఉత్పత్తి వ్యయం కన్నా 50 శాతం అధికంగా మద్దతు ధర ఉంటే మార్కెట్ పరిస్థితి దెబ్బతింటుందని, కొన్ని నిశ్చిత పంటల విషయంలో తులనాత్మక ప్రయోజనాల సూత్రానికి వ్యతిరేకమవుతుందని వ్యవసాయంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులు వెల్లడించాయి. ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షతన ఏర్పాటైన జాతీయ స్థాయి కమిషన్ వెల్లడించిన మేరకు ఉత్పత్తి వ్యయం కన్నా 50 శాతం అధికంగా మద్దతు ధర ఉండరాదని సిఫార్సులు చేసినట్టు కేంద్రం వెల్లడించింది. దీనివల్ల వ్యవసాయానికి వెచ్చిస్తున్న మొత్తాన్ని తగ్గించేందుకు చేస్తున్న యత్నాలకు ఎదురుదెబ్బ తగులుతుందని పేర్కొంది. కాగా, ఈ సిఫార్సులు బీజేపీ మేనిఫెస్టో హామీలకు వ్యతిరేకమే. ఎందుకంటే బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు కనీస మద్దతు ధరను ఉత్పత్తి వ్యయంకంటే 50 శాతం ఎక్కువగా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చింది. గడచిన ఖరీఫ్, రబీ సీజన్లలో వరి, గోధుమ పంటల మద్దతు ధరను స్వల్పంగా పెంచింది.