: బిల్లు ఆరు వందలే...టిప్పు 13000
సాధారణంగా ఏదయినా హోటల్కు వెళ్లినప్పుడు ఆహార పదార్థాలు సర్వ్ చేసినవాళ్లు మనకు నచ్చినట్లుగా చేస్తే టిప్పు ఇవ్వడం సర్వసాధారణం. కొన్ని సార్లు గొప్పచాటుకోవడానికి ఇచ్చినా, ఎక్కువ సార్లు వారి ఆతిథ్యానికి బహుమతిగా టిప్పుగా నాలుగు రూపాయలు ఎక్కువ ఇస్తాం. అయితే బిల్లుకు 20 రెట్లు ఎక్కువ మొత్తం టిప్పు ఇవ్వడాన్ని ఎక్కడైనా చూశారా? కనీసం విన్నారా? అలాంటి సంఘటనే అమెరికాలోని ఓ రెస్టారెంటులో జరిగింది. తన కుమారుడ్ని మిస్ అవుతున్న విధానం ఎవరికో వివరించడాన్ని విన్న కస్టమర్ ఆమె ఆప్యాయతకు చలించిపోయాడు. ఆమె సర్వ్ చేసిన ఆహార పదార్థాలకు బిల్లు 600 అయితే, టిప్పుగా మరో 13 వేల రూపాయలు కలిపి ఇచ్చి ఔదార్యం చాటుకున్నాడు. అమెరికాలోని కొన్ని రెస్టారెంట్లలో బిల్లుతో పాటు టిప్పు ఎంత? అనే దానిని బిల్లుపై పేర్కొనాల్సి ఉంటుంది. అలా రాసిన మొత్తాన్ని కార్డులోంచి తీసుకుంటారు. దీంతో అతని బిల్లు చూసిన రెస్టారెంట్ యజమాని షాక్ తిన్నాడు. ఎందుకంటే ఆ బిల్లుతోపాటు ఓ కాగితాన్ని జతచేసి పంపాడా కస్టమర్. అందులో ''నీ సర్వీసు బాగుంది, థాంక్యూ. మీ అబ్బాయి గురించి ఎవరికో చెబుతుంటే నాకు వినిపించింది. ఈ మొత్తం ఉపయోగించి అతడిని చూసి రా'' అని ఆ కాగితంపై ఉంది. ఇప్పుడీ బిల్లు, చిన్న లేఖ ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.