: మూత్రం తాగి ప్రాణాలు నిలుపుకున్నాడు!
నేపాల్ లో సంభవించిన భూకంపం వేలాది ప్రాణాలను హరించివేసింది. భారీ సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాల కింద నుంచి ఇంకా మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఈ క్రమంలో, ఓ వ్యక్తి శిథిలాల కింద మూడు రోజులకు పైగా నరకం అనుభవించి, తాజాగా బాహ్య ప్రపంచాన్ని చూశాడు. ఫ్రెంచి సహాయక బృందం అతడిని కాపాడింది. ఖాట్మండూలో ఓ భవనం భూకంపం ధాటికి కుప్పకూలగా, రిషి ఖనాల్ అనే వ్యక్తి శిథిలాల కింద కూరుకుపోయాడు. కాళ్లపై బరువైన దిమ్మలు విరిగిపడడంతో అక్కడే ఇరుక్కుపోయాడు. ప్రాణాలు నిలుపుకునేందుకు మూత్రం తాగాడు. మూడు రోజులకు పైగా స్వమూత్రం పానం చేసి, బతుకు పోరాటం సాగించాడు. చివరికి ఫ్రాన్స్ నుంచి వచ్చిన రెస్క్యూ టీం అతడిని గుర్తించి బయటికి తీసింది. అతడి పెదాలు పగుళ్లిచ్చి, గోళ్లు తెల్లగా పాలిపోయినట్టు అయిపోయాయట. ప్రస్తుతం అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు.