: ఇక మిగిలింది శ్రీనివాసన్ గెంటివేతే... నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ ప్రత్యేక సమావేశం
బీసీసీఐ నుంచి స్వయంగా తప్పుకునేందుకు నిరాకరిస్తూ, శ్రీనివాసన్ భీష్మించుకుని కూర్చోవడంతో ఆయన గెంటివేత తప్పదని తెలుస్తోంది. ఇందుకోసం బీసీసీఐ కార్యనిర్వాహక కమిటీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా నేతృత్వంలో జరగనున్న సమావేశంలో శ్రీనివాసన్ ఎటువంటి కార్యకలాపాల్లో భాగం కాకుండా నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే ఆయన ఐసీసీ అధ్యక్ష పదవి సైతం ప్రమాదంలో పడ్డట్టే. తాజాగా, బీసీసీఐలో జరిగిన మరో అవినీతి వెలుగులోకి రావడంతో దాల్మియా ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. బుకీల గురించి శ్రీనివాసన్ స్వయంగా తన కుటుంబ సభ్యులతో చర్చించినట్టు ఆరోపణలు రాగా, బెట్టింగ్ రాకెట్ లో వారి ప్రమేయంపై ఆధారాలు లభించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చివరి రోజైన మే 24న బీసీసీఐ సమావేశం కానున్నట్టు సమాచారం.