: పారిశ్రామికంగా నవ్యాంధ్ర ముందడుగు... ఒక్క రోజే తరలివచ్చిన 46 కంపెనీలు
పారిశ్రామిక రంగంలో అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో అడుగు ముందుకేసింది. విశాఖలో ఈ ఉదయం ఇండస్ట్రియల్ మిషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా పెట్టుబడులతో వచ్చిన 46 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అభివృద్ధికి సహకరించే కంపెనీలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. పరిశ్రమలు ఏపీకి తరలిరావాలన్న ఉద్దేశంతోనే ఇండస్ట్రియల్ మిషన్ కు రూపకల్పన చేశామని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకువచ్చే విషయంలో కేంద్రంతో చర్చిస్తున్నామని, హోదా వస్తే మరిన్ని పరిశ్రమలు వచ్చే వీలుకలుగుతుందని అన్నారు. పర్యావరణానికి హాని కలగని రీతిలో పారిశ్రామికీకరణ సాధించాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని, అందువల్లే తాను వివిధ దేశాలు పర్యటిస్తూ, ఇక్కడి అవకాశాల గురించి చెబుతున్నానని చంద్రబాబు వివరించారు. కొత్తగా వచ్చే పరిశ్రమల ద్వారా సుమారు 10 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయని, పరోక్షంగా మరింత మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. కాగా, విశాఖపట్నంలో ఏషియన్ పెయింట్స్, నెల్లూరులో క్రిబ్ కో, చిత్తూరులో కుర్లాన్ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ఒప్పందాలు కుదుర్చుకోనుండగా, వీరికి భూ కేటాయింపు లేఖలను బాబు ఇవ్వనున్నారు.