: కోర్టులోనే అరెస్టు చేయడంతో హడలిపోయిన హీరోయిన్, ఆపై బెయిల్
కన్నడలో పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ పూజా గాంధీ 2013 ఎన్నికల సందర్భంగా నియమావళి ఉల్లంఘించిందంటూ ఆమెపై కేసు నమోదైంది. అయితే, అప్పటి నుంచి ఆమె రాయచూర్ రెండో అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో విచారణకు సక్రమంగా హాజరు కావడంలేదట. దీంతో, న్యాయస్థానం ఆమె తీరుపై ఆగ్రహించింది. గత బుధవారం ఆమెపై అరెస్టు వారంట్ జారీ అయింది. ముందస్తు బెయిల్ కోసం సోమవారం ఉదయం పూజా గాంధీ తన న్యాయవాదితో కలిసి కోర్టు వద్దకు రాగా, న్యాయమూర్తి ఆమెను అరెస్టు చేయాలంటూ పోలీసులను ఆదేశించారు. పోలీసులు అరెస్టు చేయడంతో ఈ నటీమణి బిత్తరపోయింది. దీంతో, ఆమె న్యాయవాది బెయిల్ కోసం అర్జీ సమర్పించారు. పరిశీలించిన న్యాయమూర్తి రూ.50,000 సొంత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. దీంతో, బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి నిష్క్రమించింది. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో పూజా రాయచూరు నియోజకవర్గం నుంచి బీఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పోటీ చేసింది.