: విజయవాడ మెట్రో ప్లాన్ ఇదే... సమర్పించిన శ్రీధరన్
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు సమగ్ర ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టేబుల్ మీదకు చేరింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్ సీ) ఎండి ఇ.శ్రీధరన్ సవివర నివేదికను అందించారు. దీని ప్రకారం 2019లో పూర్తయ్యే లెక్కల ప్రకారం ప్రాజెక్టుకు మొత్తం రూ. 6,823 కోట్ల వ్యయం అవుతుంది. రెండు కారిడార్లలో ఏర్పాటు కానున్న మెట్రోలో ఒకటి 12.76 కి.మీ పొడవుండి రాజధాని నగరం అమరావతిని కలుపుతుందని, మరొకటి 13.27 కి.మీ పొడవుతో గన్నవరం విమానాశ్రయానికి దారితీస్తుందని ఆయన తన ప్లాన్లో వివరించారు. ప్రతి కిలోమీటరు దూరానికి రూ. 209 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో పూర్తిగా ఎలివేటెడ్ తరహాలో మెట్రోను నిర్మించాలా? లేదా? అన్న విషయమై 'కాపిటల్ డెవలప్ మెంట్ స్టేజ్'లోనే స్పష్టత వస్తుందని ఈ సందర్భంగా శ్రీధరన్ వ్యాఖ్యానించారు. మొత్తం 31.029 హెక్టార్ల భూమిని సేకరించాల్సి వుందని, 5 కి.మీ దూరానికి రూ.10, 10 కి.మీ లోపు రూ. 20, ఆపై రూ.30 రూపాయలు టిక్కెట్ వసూలు చేయాల్సి వుంటుందని వివరించారు.