: గంటన్నర ప్రయాణానికి 9 గంటల నరకం!
ఒకవైపు తమవారి గురించిన క్షేమ సమాచారాలు తెలియక భయాందోళనలో బయలుదేరినవారు, మరోవైపు సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో సాహస నిర్ణయం తీసుకుని కదిలిన విలేకరులు. భూకంపం వార్తలు వెలువడిన తరువాత ఢిల్లీ నుంచి ఖాట్మాండుకు ఇండిగో విమానం బరువైన హృదయాలతో శనివారం మధ్యాహ్నం బయలుదేరింది. సాధారణంగా ఖాట్మాండుకు చేరేందుకు గంటన్నర సమయం పడుతుంది. మరో అరగంటలో నేపాల్ లో ల్యాండ్ కావచ్చని భావిస్తున్న సమయంలో వీరి కష్టాలు మొదలయ్యాయి. పైలట్ తన మైక్ లో "ఖాట్మాండులోని ఏటీసీతో సంబంధాలు కట్ అయ్యాయి" అని ఎనౌన్స్ చేయడంతో ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. సరిగ్గా నిమిషం తరువాత ముందు జాగ్రత్త చర్యగా ఏటీసీని ఖాళీ చేయించారని వివరణ ఇచ్చారు. విమానం ఖాట్మాండుకు దగ్గర పడ్డా ఏటీసీ నుంచి సమాచారం లేదు. మరో పది నిమిషాల తరువాత అల్లంత దూరంలో రన్ వే కనిపిస్తుండగా, విమానాశ్రయాన్ని మూసి వేశామని, ల్యాండింగ్ కు అనుమతి లేదని సమాచారం అందింది. దీంతో చేసేదేమీ లేక విమానాన్ని తిరిగి ఢిల్లీకి మరలించాడు పైలెట్. మధ్యాహ్నం 2 గంటల తరువాత ఢిల్లీలో విమానం ల్యాండ్ అయింది. కిందకు దిగబోతున్న ప్రయాణికులకు మరో ఎనౌన్స్ మెంట్ వినిపించింది. "దయచేసి మీ సీట్లలో కూర్చోండి. మనం ఖాట్మాండు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి" అనడంతో వారంతా అలాగే కూర్చుండిపోయారు. మధ్యాహ్నం 3 గంటలు దాటింది. 4 గంటలు దాటింది. అప్పటికే దాదాపు 5 గంటలకు పైగా సీట్లలో కూర్చున్న ప్రయాణికుల్లో అసహనం పెరుగుతోంది. 4:50 గంటలకు విమానం మరోసారి గాల్లోకి లేచింది. 6:15 గంటల సమయానికి ఖాట్మాండుకు 100 కి.మీ దూరంలో ఉన్నామని చెప్పిన పైలెట్, భారీ వర్షం, వాతావరణం అనుకూలంగా లేని కారణంగా ఇప్పట్లో ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదని మరో బాంబు పేల్చాడు. విమానంలో రెండు గంటల పాటు సరిపోయే ఇంధనం ఉందని, ఆందోళన అక్కర్లేదని చెప్పాడు. మరో గంటా 45 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం రాత్రి 8 గంటల సమయంలో ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. మొత్తం మీద 9 గంటలకు పైగానే విమానంలో కూర్చుని కాళ్లు పీక్కుపోయి అవస్థలు పడ్డ ప్రయాణికులు బతుకు జీవుడా అనుకుంటూ, తమవారి అన్వేషణ కోసం బరువెక్కిన గుండెలతో బయటకు వెళ్లారు. కాగా, ఈ విమానంలో దేశ విదేశీ జర్నలిస్టులు వెళ్లిన తరువాతనే భూకంపం అసలు విలయం వెలుగులోకి వచ్చింది.