: ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల బలి... రెండేళ్లలో 21 మందిని బలిగొన్న మృత్యులోయ
అది నిజంగా మృత్యులోయే. ప్రమాదమని హెచ్చరికల బోర్డులున్నా సరదాను కోరుకునే యువత దాన్ని పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. బెంగళూరు సమీపంలో ఉన్న నీరు నిండిన ఓ క్వారీ అది. ఐదు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే, వారంతా ఇంజనీరింగ్ విద్యార్థులు. మొత్తం 8 మంది. సరదాగా ఈత కొట్టేందుకు ఓ నీరు నిండిన క్వారీలోకి వెళ్లారు. సుమారు 80 అడుగుల లోతున్న క్వారీలోకి ఐదుగురు దిగి ఈత కొడుతుండగా, ముగ్గురు ఒడ్డున కూర్చున్నారు. వీరిలో ఒకడు ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోగా, రక్షించేందుకు ఒకరి తరువాత ఒకరు వెళ్లి నీటిలో మునిగిపోయారు. ఈ క్వారీలో గత రెండేళ్లలో 21 మంది చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో భారీ వర్షాలకు క్వారీ నిండిపోగా, చుట్టుపక్కల కాలేజీల నుంచి విద్యార్థులు వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారని తెలుస్తోంది. దీన్ని నో ఎంట్రీ జోన్ గా ప్రకటిస్తూ బోర్డులు పెట్టామని, అయితే, ఫెన్సింగ్ వేయలేదని పోలీసులు తెలిపారు.