: ఇంటికి మరుగుదొడ్డి లేకపోతే ఒంటిపై గుడ్డలు లేనట్టే: స్పీకర్ కోడెల
స్పీకర్ కోడెల శివప్రసాదరావు రాజధాని అమరావతిలోని తుళ్లూరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మరుగుదొడ్ల ఆవశ్యకతను వివరించారు. ఇంటికి మరుగుదొడ్డి లేకపోతే ఒంటిపై బట్టలు లేనట్టేనని అన్నారు. ఇంట్లో స్త్రీలు చెంబు పట్టుకుని బహిర్భూమికి వెళ్లడం ఎంతో అవమానకరమన్న విషయం గుర్తిస్తే... ఉన్నోళ్లు సొంతడబ్బులతో మరుగుదొడ్డి నిర్మించుకుంటారని, లేనివాళ్లు ప్రభుత్వ సాయంతో మరుగుదొడ్డి నిర్మించుకుంటారని పేర్కొన్నారు. స్కూలు స్థాయిలో బడి మానేసే బాలికల్లో ప్రతి 10 మందిలో ఏడుగురు ఈ సమస్య కారణంగానే చదువుకు స్వస్తి చెబుతున్నారని కోడెల ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లలో మరుగుదొడ్లు లేని కారణంగానే వారు పాఠశాలకు రావడంలేదని వివరించారు. ఈ పరిస్థితి మారాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కోసమో, చంద్రబాబు కోసమో కాకుండా, మనకోసం మనం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు.