: హైకోర్టు హాల్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం... నిశ్చేష్టులైన కోర్టు సిబ్బంది
హైదరాబాదులోని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులోని హాల్ నెంబర్-8లో ఈరోజు ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటనతో అక్కడున్న కోర్టు సిబ్బంది, పోలీసులు నిశ్చేష్టులయ్యారు. వెంటనే కొందరు అతని ఒంటిపై మంటలార్పి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. తన కేసు విచారణకు రావడం లేదన్న మనస్తాపంతోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. కాగా, కోర్టుకి వచ్చీరావడంతోనే, పోలీసుల వల్ల తనకు అన్యాయం జరుగుతోందని, న్యాయం చేయాలని హైకోర్టు హాల్ లో బిగ్గరగా కేకలు పెట్టాడు. అప్పటికే ఒంటిపై కిరోసిన్ పోసుకుని వచ్చిన అతను, ఆ వెంటనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే ఆ వ్యక్తి పేరు తెలియరాలేదు.