: పవన్ కల్యాణ్ గారూ... మహానాడుకు రండి: జనసేన అధినేతకు టీడీపీ ఆహ్వానం
టీడీపీ ఆవిర్భావ వేడుక మహానాడుకు ఆ పార్టీ అధినాయకత్వం ఈ ఏడాది విశిష్ట అతిథిని ఆహ్వానించింది. తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటుడిగా వెలుగొందుతూనే జనసేన పేరిట పార్టీ పెట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను టీడీపీ నేతలు మహానాడుకు ఆహ్వానించారట. ఈ ఏడాది మహానాడు నవ్యాంధ్ర రాజధాని సమీపంలోని విజయవాడలో వచ్చే నెల 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు అట్టహాసంగా జరగనుంది. ఈ వేడుకలకు తప్పనిసరిగా హాజరుకావాలని పవన్ కల్యాణ్ కు ఇఫ్పటికే టీడీపీ అధినాయకత్వం నుంచి ఆహ్వానం అందిందని విశ్వసనీయ సమాచారం. మహానాడు జరిగే మూడు రోజులూ హాజరైతే మంచిది, మూడు రోజులు ఇబ్బందినిపిస్తే 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే వేడుకలకు హాజరుకావాలని పవన్ ను టీడీపీ కోరిందట. మరి పవన్ కల్యాణ్, టీడీపీ నేతల వినతిని మన్నిస్తారో, లేదో చూడాలి.