: రైతు ఆత్మహత్య కేంద్రానికి ఓ హెచ్చరిక: డీఎంకే
ఢిల్లీలో ఆప్ ర్యాలీ సందర్భంగా గజేంద్ర సింగ్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాలూకు ప్రకంపనలు ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా, డీఎంకే అగ్రనేత ఎంకే స్టాలిన్ స్పందించారు. రైతు బలవన్మరణం కేంద్రానికి ఓ హెచ్చరిక అని పేర్కొన్నారు. భూసేకరణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని సూచించారు. అటు, తమిళనాడు అధికార పక్షం ఏఐఏడీఎంకేను కూడా, ప్రజా వ్యతిరేక చట్టానికి మద్దతివ్వడంపై పునరాలోచించుకోవాలని కోరారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. గజేంద్ర సింగ్ మృతికి స్టాలిన్ సంతాపం తెలిపారు. ఆ వార్త తెలిసిన వెంటనే నివ్వెరపోయానని పేర్కొన్నారు. భూమి అనేది ఆస్తి మాత్రమే కాదని, బతుకు బండి నడిచేందుకు అదో వనరు అని వివరించారు. సొంతదారులు భూమితో భావోద్వేగపూరిత సంబంధం కలిగి ఉంటారని, డబ్బుతో దానికి పరిహారం చెల్లించలేమని అన్నారు.