: ఆ యాడ్ ను నిలిపివేసిన కల్యాణ్ జ్యూయలర్స్
ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్ చిత్రంతో తాజాగా విడుదల చేసిన ఆభరణాల ప్రమోషనల్ వ్యాపార ప్రకటనను విరమించుకుంటున్నట్టు కల్యాణ్ జ్యూయలర్స్ తెలిపింది. ఈ ప్రకటనలో నిండైన ఆభరణాలు ధరించి ఐశ్వర్య కూర్చొని ఉండగా, వెనుకవైపున ఒక బాలుడు గొడుగు పట్టుకొని ఉన్నట్టు ఉంది. ఈ ప్రకటన జాత్యహంకారాన్ని, బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించేదిగా ఉందని, పలు బాలల హక్కుల సంఘాలు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఒక మెట్టు దిగిన కల్యాణ్ జ్యూయలర్స్ తన ఫేస్ బుక్ పేజీలో వివరణ పెట్టింది. "రాచరికాన్ని, హుందాతనాన్ని ప్రతిబింబించేలా దీన్ని తయారుచేశాము. ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశం లేదు. మా ప్రచారం నుంచి ఈ చిత్రాన్ని తొలగిస్తున్నాము" అని పేర్కొంది.