: అంతరిక్ష పరిశోధనలో ప్రపంచానికే భారత్ ఓ రోల్ మోడల్: ఇస్రో మాజీ చీఫ్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సాధిస్తున్న విజయాలపై ఆ సంస్థ మాజీ చీఫ్ కె.రాధాకృష్ణన్ కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. పరిశోధనల్లో ప్రపంచానికే భారత్ ఓ రోల్ మోడల్ అని, సామాన్యుల ప్రయోజనం కోసం అన్వేషణలు చేస్తోందని ప్రశంసించారు. పీసీ చంద్ర పురస్కార్ తో పీసీ చంద్రగ్రూప్ ఆయనను సన్మానించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ఈ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం (స్పేస్ సైన్స్) తప్పకుండా ఈ దేశ ప్రజలకు, ఈ దేశ పరిపాలనకు ఉపయోగపడాల్నదే భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ స్థాపకుడైన విక్రమ్ సారాభాయ్ ఆలోచన. ప్రస్తుతం ఈ పరిశోధన రంగంలో మేం చేస్తున్నది అదే. ఈ దేశ ప్రజల ప్రయోజనానికి అంతరిక్షాన్ని ఎలా ఉపయోగించవచ్చన్న విషయంలో భారత్ ప్రపంచానికే రోల్ మోడల్ అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా" అని రాధాకృష్ణన్ పేర్కొన్నారు.