: సీఎం రమేశ్, గల్లాలకు చంద్రబాబు షాక్... ఒలింపిక్ పదవిని పార్టీ నేతకు వదలాలని ఆదేశం


ఒకే పార్టీకి చెందిన సీఎం రమేశ్, గల్లా జయదేవ్ లు ఏపీ ఒలింపిక్ అధ్యక్ష పదవికి దక్కించుకునేందుకు రోడ్డెక్కారు. సిగపట్లు పట్టుకుని మరీ ఎవరికి వారు తామే అధ్యక్షులమని ప్రకటించుకున్నారు. అయితే వారి వాదులాట రాష్ట్రంలో టీడీపీ ప్రతిష్ఠకు భంగం కలిగించిందని పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు భావించారు. నిన్నటి ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన వారిద్దరికీ తలంటారు. దాదాపు అరగంట పాటు ఇద్దరికీ క్లాసు పీకారు. నిన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, టీడీపీపీ భేటీకి ముందు సీఎం రమేశ్, గల్లా జయదేవ్ లను తన కాటేజీకి పిలిపించుకున్నారు. ఇద్దరికీ ఒకేసారి బ్రెయిన్ వాష్ చేశారు. ఇద్దరూ ఆ పదవిని వదులుకుని, పార్టీకి చెందిన మరో నేతకు ఆ పదవిని అప్పగించమంటూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక సదరు పదవికి నేతను ఎంపిక చేసే పనిని ఇద్దరూ కలిసి కూర్చుని నిర్ణయించండంటూ ఆయన హుకుం జారీ చేశారు. దీంతో చేసేదేమీ లేక ఇద్దరు ఎంపీలు చంద్రబాబు ముందు తలాడించక తప్పలేదు. మరి చంద్రబాబు ఆదేశాలను వారు ఎప్పుడు అమలు చేస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News