: సార్, తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలుస్తాయా?: చంద్రబాబుకు ట్రైనీ ఐఏఎస్ ల ప్రశ్న!


రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ కార్యకలాపాలను సమన్వయం చేయడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న ఓ విచిత్ర ప్రశ్నను ఎదుర్కొన్నారు. అది కూడా భవిష్యత్తులో పరిపాలనలో కీలకంగా మారనున్న ట్రైనీ ఐఏఎస్ ల నుంచి ఆ ప్రశ్న ఎదురుకావడంతో ఏం చెప్పాలో అర్థం కాలేదట. ట్రైనీ ఐఏఎస్ ల కోరిక మేరకు వారికి పాఠాలు చెప్పేందుకు నిన్న ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడెమీకి చంద్రబాబు వెళ్లిన సంగతి తెలిసిందే. బోధన అనంతరం ట్రైనీ ఐఏఎస్ లతో చంద్రబాబు కాస్త కులాసాగా గడిపారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్ లు అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు తీరికగా సమాధానం చెప్పారు. ఇంతలో ఓ ట్రైనీ ఐఏఎస్ లేచి ఓ విచిత్ర ప్రశ్నను సంధించాడు. ‘‘సార్, భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలుస్తాయని మీరు భావిస్తున్నారా?’’ అంటూ ఆ భావి ఐఏఎస్ అడగడంతో సభ నవ్వులతో నిండిపోగా, సమాధానం ఏం చెప్పాలో తెలియక చంద్రబాబు తటపటాయించారు. ఆ తర్వాత సర్దుకుని ‘విభజన గత చరిత్ర. భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్లాని కోరుకుంటున్నా’’ అని ముక్తాయించారు.

  • Loading...

More Telugu News