: వరుడి చెంప పగలగొట్టిన మాజీ గర్ల్ ఫ్రెండ్... అతడి సోదరుడిని పెళ్లాడిన వధువు
బాలీవుడ్, టాలీవుడ్ సినిమా కథలకు ఎంతమాత్రమూ తగ్గని సంఘటన ఇది. వివాహ వేడుక వైభవంగా జరుగుతున్న శుభవేళ, మరి కాసేపట్లో తాళి కట్టాల్సిన వరుడిని, ఒకమ్మాయి నలుగురి ముందూ పట్టుకొని ఎడాపెడా వాయించేసరికి, తొలుత ఖిన్నురాలైనా, ఆపై జరిగిన సంగతి తెలుసుకొని, వరుడి సోదరుడితో తాళి కట్టించుకున్న వధువు కథ ఇది. ఈ ఘటన హరిద్వార్ సమీపంలోని అవడిపుర్హాల్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెడితే, వివాహ మండపంలోకి ఒక యువతి బాంబులా దూసుకొచ్చింది. వరుడిని పట్టుకుని చెంపలు వాయించింది. చుట్టుపక్కలవారు ఆమెను పక్కకు తోసి విషయం అడుగగా, వరుడికి తాను మాజీ గర్ల్ ఫ్రెండ్ నని, ఎన్నో సంవత్సరాల నుంచి తామిద్దరికీ సంబంధం ఉందని చెప్పింది. ఈ పెళ్లి చేసుకుంటే అరెస్ట్ చేయిస్తానని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆపై మరో కథ మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని పెళ్లి చేసుకునేది లేదని వధువు భీష్మించుకు కూర్చుంది. ఆమె బాధను చూసిన బంధువులు, వరుడి తరపువారిని వెళ్లిపోవాలని కోరారు. మాటా మాటా పెరుగగా, పోలీసు స్టేషనుకు వెళ్లాలని అనుకున్న ఇరు వర్గాలు, చివరికి పంచాయితీని ఆశ్రయించాయి. వరుడి తరపు వారు తమను క్షమించాలని పంచాయితీలో కోరారు. కేసుల దాకా పోకుండా మధ్యేమార్గంగా వరుడి తమ్ముడిని వివాహం చేసుకోవాలని వధువుకు సూచించారు. ఈ సూచనకు వధువుతో పాటు కాబోయిన వరుడి తమ్ముడు కూడా అంగీకరించడంతో పెళ్లి తతంగం పూర్తయింది.