: విఫలమైన 'మంచి రోజుల ప్రభుత్వం': విపక్షం నుంచి రాహుల్ తొలి ప్రసంగం
కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తరువాత ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ నేడు పార్లమెంటులో తొలిసారిగా ప్రసంగించారు. మోదీ సర్కారును ఏకిపారేశారు. 'మంచి రోజుల ప్రభుత్వం' (అచ్ఛే దిన్ సర్కార్) అంటూ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం అయిందని ఆయన దుయ్యబట్టారు. "ఇక్కడ దేశం ఉంది. కానీ అది మీది కాదు. కేవలం రాజకీయ సమీకరణాల కారణంగానే మోదీ ప్రధాని అయ్యారు. మీకు రాజకీయ సమీకరణాలు బాగా తెలుసు. నాకో సందేహం వస్తోంది. మీకు సమీకరణాలు బాగా తెలిసుంటే దేశంలోని 60 శాతం మంది రైతులకు కోపం వచ్చే పనులు ఎందుకు చేస్తున్నారు? రక్షణ రంగం అంటారు, మిస్సైల్స్ అంటారు, యుద్ధ విమానాలు అంటారు. మరి రైతుల గోడు మీకెందుకు పట్టదు? భూమిపై ఆధారపడ్డ రైతుల కన్నా, ఆ భూమిని కావాలనుకుంటున్న కార్పొరేట్లకు మేలు చేకూర్చాలన్నదే మీ అభిమతమని నేను అనుకుంటున్నాను" అని విమర్శలు గుప్పించారు. మోదీ సర్కారు ఎన్నో తప్పులను చేస్తోందని, వాటిని ఇంకెంతో కాలం సహిస్తూ ఊరుకునేది లేదని అన్నారు. దేశంలో రైతుల కారణంగానే హరిత విప్లవం విజయవంతమైందని గుర్తు చేసిన ఆయన, ఈ సీజన్ లో కనీస మద్దతు ధర ప్రకటించడంలో కేంద్రం విఫలమైందన్నారు. రాహుల్ ప్రసంగానికి విపక్ష సభ్యుల నుంచి మంచి మద్దతు లభించగా, అడ్డుకునేందుకు ఎన్డీఏ సభ్యులు అడుగడుగునా ప్రయత్నించారు. రాహుల్ ముఖంలో కాన్ఫిడెన్స్ కనిపించింది. గతంతో పోలిస్తే కొంత ఒళ్లు చేసినట్టుగా కూడా కనిపించారు.