: ఈ అక్షయ తృతీయకు బంగారం కొనద్దు... ఎందుకంటే..!
బంగారం అంటే భారతీయులకు, అందునా మహిళలకు ఎంత ప్రీతో ఒక్క మాటల్లో చెప్పలేం. బంగారం కొనుగోలుకు అత్యంత శుభప్రదమైన రోజుల్లో ఒకటిగా భావించే అక్షయ తృతీయ పర్వదినం నాడు బంగారం కొనుగోలు చేయాలని ఎందరో భావిస్తారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండగ రేపు రానుంది. ఈ నేపథ్యంలో బంగారంలో పెట్టుబడి పెట్టాలని భావించేవారు, పెద్దఎత్తున నగలు కొనాలని కోరుకునేవారు సమీప భవిష్యత్ లో నష్టపోయే అవకాశాలే కనిపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆస్తి కేటాయింపు ప్రణాళికల్లో భాగంగా ఈక్విటీలు, భూమి, బంగారం తదితరాలపై పెట్టుబడులు పెట్టే భారతీయులు దీర్ఘకాలంలో మంచి రాబడులు అందించే మార్గాల్లో పసిడి ఒకటని నమ్ముతారు. ఇదే సమయంలో గత సంవత్సరం అక్షయ తృతీయ నాడు బంగారంపై పెట్టిన పెట్టుబడి కనీస వడ్డీని కూడా అందించక పోగా, ధర 8.4 శాతం తగ్గింది. ఇక, గడచిన మూడేళ్ల పరిస్థితిని చూసినా ఇలాగే ఉంది. 2012 అక్షయ తృతీయ నాటి బంగారం పెట్టుబడి ప్రస్తుతం 3.4 శాతం తగ్గిపోయి వుంది. సమీప భవిష్యత్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంటుందని అంచనా. ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ అన్నీ బంగారానికి వ్యతిరేకంగానే ఉన్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం మొదలు పెడితే, ప్రపంచ మార్కెట్లు ముందడుగు వేస్తాయి. దీంతో సహజంగానే బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బులియన్ మార్కెట్లో రిస్క్ అధికమవుతుందని అంచనా వేస్తున్నారు. ధరలు భారీగా పతనం కాకపోయినప్పటికీ, ఎక్కువ పెరుగుదల కూడా నమోదుకాదని భావిస్తున్నారు. 2003 నుంచి 2012 వరకూ సరాసరిన పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్ ఆ తరువాత తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీగా బంగారం కొనడం లాభదాయకం కాదని నిపుణులు సూచిస్తున్నారు. వివాహ సీజన్లో కొంతమేరకు ధరలు పెరుగుతున్నట్టు కనిపించినా, మోదీ సర్కారు తీసుకున్న బంగారంపై దిగుమతి సుంకాల తగ్గింపు నిర్ణయం అమల్లోకి వస్తే, దేశవాళీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 23 వేల వరకూ దిగివస్తుందని అంచనా. అయితే, "సెంటిమెంట్ ను నమ్మి అక్షయ తృతీయ సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఒకటో, రెండో గ్రాముల బంగారం కొని పెట్టుకుంటే తప్పేముంది?" అనే వారి సంఖ్యా లేకపోలేదు.