: సీపీఎం కొత్త సారధి సీతారాం ఏచూరి... హర్షం వ్యక్తం చేసిన సోమనాథ్ చటర్జీ


సీపీఎం ప్రధాన కార్యదర్శిగా తెలుగు నేత సీతారాం ఏచూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు విశాఖలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం తాజా మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అధికారికంగా ప్రకటించారు. ఈ పదవి కోసం కేరళ నేత రామచంద్రన్ పిళ్లై నామినేషన్ దాఖలు చేసినా, ఎన్నిక ఏకగ్రీవంగానే జరగాలన్న కారత్ ఆదేశాలతో ఆయన తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో సీతారాం ఏచూరి ఎన్నిక ఏకగ్రీవమైంది. 1952, ఆగస్టు 12న జన్మించిన ఏచూరి 1974లో సీపీఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐలో చేరారు. ఆ తర్వాత సీపీఎంలో అంచెలంచెలుగా ఎదిగి, కొంతకాలంగా పార్టీ పోలిట్ బ్యూరోలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. పార్టీలో పెద్ద సంఖ్యలో నేతలున్నా, సీపీఎం పార్టీకి ఏచూరి గొంతుకగా మారారు. జాతీయ అంశాలపై మంచి పట్టున్న ఆయన, పార్లమెంటులోనూ అధికార పార్టీలకే కాక విపక్షాలకు కూడా కొరకరాని కొయ్యగానే పరిణమించారు. తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడంతో ఆయన మరింత మేర రాణించే అవకాశాలున్నాయి. ఏచూరి ఎన్నిక పట్ల పార్టీ మాజీ నేత, లోక్ సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ హర్షం ప్రకటించారు. గతంలో సీపీఎం నేతల తీరుతో విభేదించిన చటర్జీ, పార్టీని కూడా వీడారు. అయినా, ఆయన ఏచూరి నియామకం పట్ల హర్షం ప్రకటించడం గమనార్హం.

  • Loading...

More Telugu News