: టాలీవుడ్ లో మరో విషాదం... సంగీత దర్శకుడు 'శ్రీ' అకాల మరణం
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో మరణం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి (శ్రీ) నిన్న సాయంత్రం కన్నుమూశారు. అలనాటి ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి కుమారుడైన ఆయన, పలు తెలుగు హిట్ చిత్రాలకు సంగీతం అందించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లు గ్రామానికి చెందిన 'శ్రీ', కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న సాయంత్రం కొండాపూర్ లోని తన స్వగృహంలోనే ఆయన తుది శ్వాస విడిచారు. సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీలతో సన్నిహితంగా మెలగిన 'శ్రీ', వారు తెరకెక్కించిన పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించారు. గాయం, సింధూరం, అమ్మోరు చిత్రాలకు ఆయన అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది. శ్రీ మంచి గాయకుడు కూడా! 'చక్రం' సినిమాలోని బహుళ ప్రజాదరణ పొందిన 'జగమంత కుటుంబం నాది...' పాటను ఆయనే పాడాడు. ఈ పాట గాయకుడుగా ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది.