: అప్పటి రూ. 850 ఇప్పుడు రూ. 10,000!
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇండియాలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ. ఈ వారంతో సంస్థ ప్రారంభించి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా వన్ టైం బోనస్ అంటూ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ నేపధ్యంలో గత దశాబ్దకాలంలో సంస్థ పనితీరు పరిశీలిస్తే, పదేళ్ళ క్రితం టీసీఎస్ లో ఒక్క వాటాను రూ. 850కి కొనుగోలు చేసిన వారు ఇప్పుడు రూ. 10 వేలను జేబులో ఉంచుకున్నట్టే. ఈ పదేళ్లలో పది రెట్లకు పైగా లాభాలను అందించిన అతికొద్ది కంపెనీల్లో టీసీఎస్ ఒకటి. జూలై 2004లో టీసీఎస్ ఐపీఓ పెట్టింది. ఆ సమయంలో ఒక్కో ఈక్విటీ వాటాను రూ. 775 నుంచి రూ. 900 మధ్య సంస్థ విక్రయించగా, పెట్టుబడిదారులకు సరాసరిన రూ. 850కి ఒక్కో వాటా లభించింది. ఆగస్ట్ 25న సంస్థ వాటాలు లిస్టింగ్ కాగా, తొలిరోజే అద్భుత పనితీరు కనబరిచి 26.6 శాతం లాభంతో రూ. 1,076 వద్ద కొనసాగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకూ రెండుసార్లు 1:1 నిష్పత్తిలో టీసీఎస్ బోనస్ వాటాలు ఇచ్చింది. అంటే, 2004లో ఒక్క టీసీఎస్ వాటాను కొనుగోలు చేసిన వారి వద్ద ఇప్పుడు 4 వాటాలు ఉన్నట్టు. నిన్నటి మార్కెట్ సెషన్ లో ఒక్కో వాటా విలువ రూ. 2,476.20 రూపాయల వద్ద ముగిసింది. అంటే మొత్తం 4 షేర్ల విలువ రూ. 9,904.80 అన్నమాట. అంటే సంవత్సరానికి 27.8 శాతం మేరకు అప్పటి రూ. 850 పెట్టుబడి పెరుగుతూ వచ్చిందన్నమాట! దీనికి అదనంగా మొత్తం రూ. 733.50ని సంస్థ వివిధ సమయాల్లో డివిడెండ్ రూపంలో అందించింది కూడా.