: స్మిత్, మెక్ కల్లమ్ విధ్వంసం...ముంబై నాలుగో ఓటమి
విండీస్ బ్యాట్స్ మన్ డ్వేన్ స్మిత్ (30 బంతుల్లో 62; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ (20 బంతుల్లో 46; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కలసి ముంబై వాంఖడే స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. 184 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు ముంబై బౌలర్లపై విరుచుకునపడ్డారు. దీంతో 184 పరుగుల లక్ష్యాన్ని మరో 20 బంతులు మిగిలుండగానే ఛేదించింది. టోర్నీలో వరుసగా మూడో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. పొలార్డ్ (64), రోహిత్ శర్మ (50), రాయుడు (29) రాణించడంతో 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై ఆరంభంలోనే ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. దీంతో ముంబై బౌలర్లు చేష్టలుడిగిపోయారు. ఎలాంటి బంతి వేసినా బౌండరీ లైన్ దాటేది. దీంతో ఏం చేయాలో, ఎలాంటి బంతులు సంధించాలో కూడా బౌలర్లకు అర్థం కాలేదు. పవర్ ప్లేలోనే వీరిద్దరూ జట్టు స్కోరును 90 పరుగులు దాటించారంటే ఏ స్థాయిలో ఆడిఉంటారో ఊహించవచ్చు. 8వ ఓవర్ లో హర్బజన్ సింగ్ వీరిద్దరినీ నాలుగు బంతుల తేడాలో పెవిలియన్ బాటపట్టించాడు. దీంతో ముంబై కాస్త కోలుకుంది. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోవడంతో చెన్నై బ్యాట్స్ మన్ ఆడుతూపాడుతూ లక్ష్యం సాధించారు.