: బర్డ్ ఫ్లూ భయం...చికెన్ వ్యాపారం ఢమాల్
నిన్నటి వరకూ ముక్క లేనిదే ముద్ద దిగేది కాదు. ఇప్పుడో చికెన్ తినాలంటేనే భయం. లేనిపోని ఇబ్బందులెందుకనుకున్న ప్రజలు చికెన్ పరిసరాల్లోకి కూడా వెళ్లడం లేదు. అకాల వర్షాలకు తోడు, రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం తొర్రూరులో బర్డ్ ఫ్లూ వ్యాధి వెలుగు చూసింది. దీంతో బెంబేలెత్తుతున్న జనం కోళ్లు, కోడి గుడ్లు కొనడం, తినడం మానేశారు. దీని ప్రభావం దేశంలోనే అతిపెద్ద పౌల్ట్రీ హబ్ గా పేరొందిన రంగారెడ్డి జిల్లాపై పడింది. పట్టణాలు, గ్రామాలు అని తేడా లేకుండా చికెన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. గతంలో ఉత్తరభారత దేశంలో బర్డ్ ఫ్లూ ప్రబలి లక్షల కోళ్లను ఖననం చేసిన సందర్భంగా ఇదే పరిస్థితి తలెత్తడంతో, ప్రజల ఆందోళన తొలగించేందుకు చికెన్ ఫెస్టివల్ నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా, హైదరాబాదు పరిసరాల్లోనే బర్డ్ ఫ్లూ వెలుగు చూడడంతో వ్యాపారం పుంజుకోవడానికి ఏం చేయాలో వ్యాపారులకు అర్థం కావడం లేదు. పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతినకుండా చూడాలని, బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించాలని అధికారులను వ్యాపారులు కోరుతున్నారు.