: వ్యాపమ్ స్కాం కేసులో మధ్యప్రదేశ్ గవర్నర్ అరెస్టుపై స్టే
ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (ఎంపీపీఈబీ) పరీక్షలు, నియామకాల కుంభకోణం కేసులో మధ్యప్రదేశ్ గవర్నర్ రాం నరేశ్ యాదవ్ కు తాత్కాలిక ఉపశమనం లభించింది. ఈ కేసులో ఆయన అరెస్టుపై స్టే ఇస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ స్కాంలో ఎస్టీఎఫ్ (స్పెషల్ టాస్క్ ఫోర్స్) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ గవర్నర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తనపై చర్యలు తీసుకునేందుకు వీలుండదని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. ఎంపీపీఈబీ నిర్వహించిన పరీక్షల నియామకాల్లో నలుగురు అభ్యర్ధుల పేర్లను గవర్నర్ యాదవ్ సిఫారసు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న గవర్నర్ కుమారుడు గత నెలలో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.