: బడికెళ్లేందుకు టీచర్లు కూడా భయపడుతున్నారట
మెదక్ జిల్లా జోగిపేట మండలానికి చెందిన పోసానిపేటలో ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులే కాదు, టీచర్లు కూడా భయపడుతున్నారట. గ్రామానికి చెందిన ఎం.డి.షఫీ (29) పెద్దచదువులు చదువుకుని, ఉన్నత స్థాయికి చేరాలని భావించాడు. ప్రభుత్వోద్యోగం కోసం కోచింగ్ కూడా తీసుకున్నాడు. అయితే అనుకున్నది సాధించలేకపోవడంతో ఈ నెల 11న గ్రామానికి చేరుకుని, పాఠశాల ఆవరణలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి పాఠశాలకు రావాలంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు భయపడుతున్నారు. ఘటన జరిగి ఇన్నిరోజులైనా పాఠశాలకు సగం మంది విద్యార్థులే హాజరవుతున్నారట. చెట్టుకు దగ్గర్లో ఉన్న గదికి తాళం వేసేశారట. విద్యార్థులకు ధైర్యం చెప్పాల్సిన ఉపాధ్యాయులు కూడా భయపడడం విశేషం.