: ఔత్సాహికుల ఫేస్ బుక్ పేజీలను నిషేధించనున్న కేంద్రం
గత కొన్ని సంవత్సరాలుగా స్టార్ట్-అప్ ఔత్సాహికులు ఫేస్ బుక్ లో ఒక పేజీ క్రియేట్ చేసి తమకు తామే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లుగా ప్రకటించుకోవడం పెరిగిపోయిన నేపథ్యంలో అటువంటి పేజీలను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీరందరినీ నిరుద్యోగులుగానే పరిగణించాలన్నది కేంద్రం ఆలోచన. "నేనొక ఫేస్ బుక్ పేజీని ఇటీవల ప్రారంభించి దానికి ఒక పేరు పెట్టాను. ఒక వ్యాపారవేత్తకు తొలి అడుగు ఫేస్ బుక్ పేజీ. ఇది తరువాతి దశలో ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ తరహా పేజీలు నిషేధించాలని భావిస్తోంది. ఇక నేను నా తల్లిదండ్రులకు నేను నిరుద్యోగినే అని చెప్పేయాలి" అని ఒక స్టార్ట్-అప్ ఔత్సాహికుడు వ్యాఖ్యానించారు. "ధనవంతులు కావాలన్న ఆశతో ఏ విధమైన నైపుణ్యాలు లేకుండానే సులభంగా వ్యాపారం చేయాలని కొందరు భావిస్తున్నారు. వారికి నేను చెప్పేది ఒకటే. అటువంటి వారు రాజకీయాల్లో చేరాలి. మీరు నిరుద్యోగులైతే ఆప్ లేదా మరో పార్టీలో చేరండి. అంతేకానీ ఫేస్ బుక్ లో ఒక పేజీ క్రియేట్ చేసి మీకు మీరే సీఈఓగా ప్రకటించుకోకండి" అని ఒక ప్రభుత్వ అధికారి సూచించారు. ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ మాత్రం భారత ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అటువంటి పేజీలే తమకు అతిపెద్ద ట్రాఫిక్ ఆధారమని ఆయన అన్నారు. ఈ పేజీలను, వీటితోపాటు నకిలీ చిత్రాలనూ భారత ప్రభుత్వం నిషేధిస్తే, ఇండియాలో తమ దుకాణాన్ని మూసేయల్సిందేనని అన్నారు. ఈ నిషేధానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.