: అత్యాచారం..పెళ్లి..ఆపై హత్య: గుంటూరు జిల్లాలో కర్నూలు మృగాడి ఘాతుకం!
కర్నూలు జిల్లాకు చెందిన ఓ మృగాడు నిన్న గుంటూరు జిల్లాలో ఘాతుకానికి ఒడిగట్టాడు. ఓ యువతిపై అత్యాచారం చేసి, కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమెనే పెళ్లి చేసుకుని, ఆ తర్వాత పక్కాగా వేసుకున్న పథకం ప్రకారం బాధితురాలిని మట్టుబెట్టాడు. సదరు దుర్మార్గుడిని గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే... కర్నూలు జిల్లా కోసిగి మండలం పల్లిపాడుకు చెందిన ఏసు అనే దుర్మార్గుడు, గ్రామానికి చెందిన జయ అనే యువతిపై ఈ ఏడాది జనవరిలో అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు నుంచి తప్పించుకునేందుకు అతడు పథకం పన్నాడు. బాధితురాలిని ఒప్పించి అదే నెల 21న పెళ్లి చేసుకున్నాడు. తర్వాత దంపతులిద్దరూ మిరప కోతల కోసం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం గ్రామానికి వెళ్లారు. ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం మంగళవారం రాత్రి అతడు జయ గొంతు నులిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ మృగాడిని అరెస్ట్ చేశారు.