: వ్యాధి నయం చేస్తానని, నరాలు తీసేశాడు: రిటైర్డ్ ఎస్సై ఫిర్యాదు


వైద్యుల లీలలు అన్నీ ఇన్నీ కావు, చిత్రవిచిత్రమైన కేసులు వైద్యులపై నమోదవుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వ్యాధి నయం చేస్తానని చెప్పిన వైద్యుడు, అడిగినంత ఫీజు చెల్లించలేదన్న కోపంతో, రోగి నరాలు తొలగించిన సంఘటన కలకలం రేపుతోంది. దీనిపై హైదరాబాదు, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ తేజస్వినగర్ కాలనీలో నివాసం ఉండే చిక్కడపల్లి రిటైర్డ్ ట్రాఫిక్ ఎస్సై వి.రమేష్ (58) జనవరి 7న రెండు వెరికోస్ వీన్స్ (నరాల సంబంధిత వ్యాధి)తో బాధపడుతూ జూబ్లీహిల్స్ లోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. మరుసటి రోజు ఆసుపత్రి వైద్యుడు చంద్రశేఖర్ ఆయన గదికి వచ్చి, ఆ వ్యాధికి అవసరమయ్యే ఆర్ఎఫ్ఏ థెరపీకి 10 వేల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో రమేష్ తన దగ్గర 5 వేల రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పి అతనికి అందజేశారు. వ్యాధి తగ్గకపోవడంతో ఆయన మరో ఆసుపత్రిని సంప్రదించారు. కాలిలో రెండు నరాలు తొలగించినట్టు అక్కడి వైద్యులు అతనికి షాకింగ్ న్యూస్ చెప్పారు. దీంతో జరిగిన దారుణంపై రమేష్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనికి కారణమైన వైద్యుడిపై సెక్షన్ 420, 336 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News