: మన్మోహన్ ను రాజా తప్పుదోవ పట్టించారు: 2జీ కేసు విచారణలో సీబీఐ వాదన
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను అప్పటి టెలికాం మంత్రి, డీఎంకే నేత ఏ.రాజా తప్పుదోవ పట్టించారట. రాజా కనికట్టు కారణంగానే ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ నాడు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కోర్టుకు తెలిపింది. దేశాన్నే కుదిపేసిన 2జీ స్ప్రెక్ట్రం కేసులో ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో కొద్దిసేపటి క్రితం వాదనలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా సీబీఐ న్యాయవాది ఏ.రాజాపై మోపిన అభియోగాలను కోర్టు ముందు ఏకరువు పెట్టారు. ఎలాంటి అర్హత లేని స్వాన్, యూనిటెక్ లకు రాజా నిబంధనలను అతిక్రమించి స్ప్రెక్ట్రంను కేటాయించారని ఆరోపించారు. ఇందుకోసం రాజా ఏకంగా ప్రధాని మన్మోహన్ సింగ్ నే తప్పుదోవ పట్టించారని వాదించారు. ప్రస్తుతం వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ కేసులో నేడు తుది తీర్పు వెలువడనుందన్న ప్రచారమూ సాగుతోంది.