: టీఆర్ఎస్ యువరాజుగా కేటీఆర్... వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలపై జోరుగా ప్రచారం!
జాతీయ పార్టీ కాంగ్రెస్ లో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యువరాజుగా జేజేలు అందుకుంటుంటే, తెలంగాణలోనూ ఓ యువరాజు తెరపైకి రాబోతున్నారట. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కల్వకుంట్ల తారక రామారావు కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నెల 24న జరగనున్న పార్టీ ప్లీనరీలో భాగంగా ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని ప్రచారం సాగుతోంది. కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ లో ఇప్పటికే కేటీఆర్ సీఎం తర్వాత స్థాయి నేతగా మన్ననలను అందుకున్నారు. తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరిస్తే, ఆయన ప్రాబల్యం మరింతగా పెరగనుందన్న వాదన వినిపిస్తోంది. కేటీఆర్ తో పాటు కేబినెట్ లోని మరో ముగ్గురు నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఈ విషయాలపై ఆయన ఇప్పటికే తన ఆంతరంగికులతో జరిపిన చర్చల్లో నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.