: చంచల్ గూడ జైల్లో ఉగ్రవాదుల నిరాహార దీక్ష... వికార్ ఎన్ కౌంటర్ కు నిరసనగానేనట!
చట్టం, పోలీసు నిబంధనలంటే ఉగ్రవాదులకు అలుసే. భారత చట్టాలకు ఇస్లామిక్ ఉగ్రవాదులు ఏమాత్రం జడుసుకోవడం లేదని మరోమారు రూఢీ చేసే ఘటన నిన్న హైదరాబాదులో చోటుచేసుకుంది. హైదరాబాదులోని చంచల్ గూడ జైల్లో నిన్న ఇస్లామిక్ ఉగ్రవాదులు నిరాహార దీక్ష ప్రారంభించారు. జైలు అధికారులకు రాతపూర్వకంగా నోటీసు ఇచ్చి మరీ ఐఎస్ఐకి చెందిన ఐదుగురు ఉగ్రవాదులు దీక్షకు దిగారు. అయినా వారి దీక్షకు కారణమేంటో తెలుసా? ఇటీవల వరంగల్, నల్గొండ జిల్లాల సరిహద్దులో కరుడుగట్టిన ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్ కౌంటర్ కు నిరసనగానే వారు ఈ దీక్షకు దిగారట. ఈ మేరకు జైల్లో ఉన్న ఉగ్రవాదులు జాహిద్, ఖలీమ్, అబిద్ హుస్సేన్, బిశ్వాక్, షకీల్ లు దీక్షకు దిగుతున్నట్లు నోటీసు ఇచ్చారని జైలు సూపరింటెండెంట్ సైదయ్య తెలిపారు. అయినా వారికి రోజు మాదిరే ఆహారం అందజేసినట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే, జైల్లో దీక్షకు దిగాలని ఉగ్రవాద నేతల నుంచి వీరికేమైనా ఆదేశాలు అందాయా? అన్న కోణంలో పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వికార్ ఎన్ కౌంటర్ తర్వాత వీరిని విచారణ నిమిత్తం ఈ నెల 9న నాంపల్లి కోర్టులో జరిగిన విచారణకు పోలీసులు తీసుకెళ్లారు. ఆ సమయంలో వీరికి ఎక్కడి నుంచైనా సందేశాలు వచ్చాయా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.