: కేజ్రీపై స్వామి అగ్నివేశ్ ఫైర్... కేజ్రీ నియంతృత్వ ధోరణితోనే ఆప్ లో చీలికలని వ్యాఖ్య!
సామాజిక ఉధ్యమనేత స్వామి అగ్నివేశ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఫైరయ్యారు. కేజ్రీవాల్ నియంతృత్వ ధోరణితోనే ఆమ్ ఆద్మీ పార్టీలో చీలికలు వచ్చాయని ఆయన ఆరోపించారు. పార్టీలో చీలికలు, వర్గ విభేదాలకు కేజ్రీవాలే బాధ్యత వహించాలని అగ్నివేశ్ అన్నారు. కేజ్రీ నియంతృత్వ ధోరణికి తానే ప్రత్యక్ష సాక్షినని కూడా అగ్నివేశ్ పేర్కొన్నారు. పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కేజ్రీవాల్ ఏ ఒక్కరిని కూడా సంప్రదించరని, అసలు తన ముందు ఎవరినీ నిలబడనివ్వరని కూడా ఆయన ఆరోపించారు. తనముందు కార్యకర్తలు సహా నేతలనూ నోరు విప్పనిచ్చేవారు కాదని కూడా అగ్నివేశ్ అన్నారు. పార్టీ ఆవిర్భావానికి ముందే కేజ్రీ నియంతృత్వ ధోరణిని గమనించానని చెప్పిన అగ్నివేశ్, ఇదే విషయాన్ని నాడే ప్రశాంత్ భూషణ్ కు వివరించానన్నారు. నాడు మౌనం పాటించిన భూషణ్, నేడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు.