: టీవీ వద్దన్న రామలింగరాజు... సందిగ్ధంలో పడ్డ చర్లపల్లి జైలు అధికారులు
టీవీ కావాలని కోరితే ఇబ్బంది కాని, టీవీ వద్దన్న ఖైదీలతో ఇబ్బందేమిటనేగా డౌటు? చర్లపల్లి జైలులో అన్ని బ్యారక్ లలో టీవీలున్నాయి. మరి సత్యం కుంభకోణంలో దోషులుగా తేలిన రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు టీవీ లేని బ్యారక్ కు మార్చమని అడిగితే, ఇబ్బంది కాక మరేమిటి? సత్యం కుంభకోణంలో రాజు సోదరులను దోషులుగా తేల్చిన కోర్టు, ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పోలీసులు వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. తాము పాల్పడిన నేరానికి సంబంధించి అన్ని ఛానెళ్లు వార్తా కథనాలను ప్రసారం చేస్తాయని భావించిన రాజు సోదరులు, తమను టీవీ లేని బ్యారక్ కు మార్చాలని జైలు అధికారులను కోరారట. అన్ని బ్యారక్ లలో టీవీలున్నాయిగా, ఏం చేద్దామని ఆలోచించిన జైలు అధికారులు ఓ రెండు బ్యారక్ లలోని టీవీలు పాడైతే రిపేరీకి ఇచ్చిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని ఊపిరి పీల్చుకున్నారు. రాజు సోదరుల కోరిక మేరకు వారిని టీవీలు లేని ఆ బ్యారక్ లలోకి తరలించారట. సదరు బ్యారక్ లలోకి వెళ్లిన రాజు సోదరులు తమ కేసు తీర్పు కాపీలను చదువుతూ కాలం వెళ్లదీశారట.