: తెలంగాణ పోలీసు అమరులకు ఏపీ పోలీసుల నివాళి!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, రాష్ట్ర విభజనతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రధానంగా రాజకీయ పార్టీల నేతలు, ఉద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు ఈ మాటల దాడిని పతాక స్థాయికి తీసుకెళ్లారు. అయితే శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీసుల్లో ఈ విభేదాలు పొడచూపలేదు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఆ జిల్లా పోలీసు శాఖ చేపట్టిన శాంతి ర్యాలీ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. నల్లొండ జిల్లాలో ‘సూర్యాపేట షూటర్స్’ దాడుల్లో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట బస్టాండ్ లో ఇద్దరు పోలీసులు చనిపోగా, జానకీపురం ఎన్ కౌంటర్ సందర్భంగా మరో పోలీసు మరణించాడు. నాటి ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఎస్సై సిద్ధయ్య రెండు రోజుల క్రితం మృత్యువుతో పోరాడి ఓడారు. నిన్న ఆయన భౌతికకాయానికి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. సిద్ధయ్య అంతిమ యాత్రను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు తెలంగాణ పోలీసు అమరులకు నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు తెలంగాణ పోలీసు అమరుల ఫొటోలతో ఏపీ పోలీసులు శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ భాస్కరభూషణ్ ప్రారంభించారు.