: కేజీ బేసిన్ లో కొత్త సహజవాయు నిక్షేపాలు... పెరిగిన రిలయన్స్ ఈక్విటీ విలువ
కృష్ణా గోదావరి- డీ6 బేసిన్ లోని ఎంజే-1 ఫీల్డ్ లో సహజవాయు నిక్షేపాలు కనుగొన్నామని రిలయన్స్ చేసిన ప్రకటన ఆ సంస్థ ఈక్విటీతో పాటు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచింది. ఈ గ్యాస్ నిక్షేపంలో 1.4 ట్రిలియన్ ఘనపుటడుగుల సహజవాయువు ఉందని రిలయన్స్ తెలిపింది. దీనికితోడు ఇంటర్నేషనల్ మార్కెట్లు లాభాల్లో ఉండడంతో భారత స్టాక్ మార్కెట్ సైతం ముందుకు కదిలింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, ఫండ్ సంస్థలూ, రిటైల్ పెట్టుబడిదారులు ఉత్సాహంగా వాటాల కొనుగోళ్లు చేశారు. బుధవారం నాటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సెన్సెక్స్ సూచీ 191.16 పాయింట్లు పెరిగి 0.67 శాతం లాభంతో 28707.75 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ సూచీ 54.10 పాయింట్లు పెరిగి 0.62 శాతం లాభంతో 8,714.40 పాయింట్ల వద్ద కొనసాగాయి. రిలయన్స్ ఈక్విటీ వాటా విలువ 3.93 శాతం పెరిగి రూ. 865కు చేరింది. ఇతర కంపెనీల్లో కోల్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, టీసీఎస్ తదితర కంపెనీలు లాభపడగా, హెచ్ డీఎఫ్ సీ, ఎస్ఎస్ టీఎల్, ఓఎన్ జీసీ, హీరో మోటో తదితర కంపెనీలు నష్టపోయాయి.