: ఫ్యాబ్ ఇండియా ఎండీ, సీఈవోకు కేంద్ర మంత్రి సమన్లు
గతవారం గోవాలోని ఫ్యాబ్ ఇండియా వస్త్ర దుకాణంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సీసీ కెమేరాలు గుర్తించడంతో రేగిన వివాదంలో ఆ సంస్థ ఎండీ, సీఈవోకు సమన్లు పంపారు. దీంతో వివాదం కొత్తమలుపు తీసుకుంది. కేంద్ర మంత్రి ఆదేశాలతో, గోవా బీజేపీ నేత మైఖెల్ లోబో ఫిర్యాదు మేరకు ఫ్యాబ్ ఇండియాపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి నలుగురుని పోలీసులు అరెస్టు చేసినా, ఆ వెంటనే వారు బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. వారికి బెయిల్ మంజూరైన అనంతరం, బీజేపీ నేతలు స్వయంగా ఈ ఘటనను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు. ఇందులో ఫ్యాబ్ ఇండియా తప్పు చేసి ఉండదని, ఫ్యాబ్ ఇండియా పెద్ద దుకాణం అని వ్యాఖ్యలు చేస్తూ జరిగినది పెద్ద విషయం కాదని, దీనికి రాద్ధాంతం అవసరం లేదనే విధంగా గోవా అధికారపార్టీ వ్యవహరించింది. ఫ్యాబ్ ఇండియా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి క్షమాపణలు చెప్పడంతో వివాదం సర్దుమణిగినట్లేనని అంతా భావించారు. ఈ నేపథ్యంలో ఆమె ఆ సంస్థ ఎండీ, సీఈవోకు సమన్లు పంపించారు. దీంతో కేంద్ర మంత్రి దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నారని, మహిళల ఆత్మగౌరవ సమస్యను తేలిగ్గా తీసుకునే సమస్యలేదని సంకేతాలు పంపినట్టైంది. ఇదే చిన్న షాపులో జరిగితే నేతలు, మీడియా మౌనం వహించేవారా? అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు రేగిన సంగతి తెలిసిందే.