: అంతటా నవమి ఘనం.. అక్కడ మాత్రం వేడుక శూన్యం
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరిగితే.. ఒక్కచోట మాత్రం నిశ్శబ్దం తాండవించింది. ఆ స్థలానికి మన పురాణాలు ఎంతో పవిత్రతను ఆపాదించాయి కూడా. కానీ, దేశ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు అక్కడ సీతారాముల కల్యాణోత్సవం జరిపేందుకు అడ్డంకిగా పరిణమించాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే.. అది రాముడి జన్మస్థలంగా వినుతికెక్కిన అయోధ్యలోని ఓ 67 ఎకరాల స్థలం. దాని పక్కనే బాబ్రీ మసీదు. ముస్లింలకు ప్రార్థనా మందిరం. రెండు దశబ్దాల క్రితం బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చే ప్రయత్నం చేయడంతో రగిలిన వివాదం అయోధ్యలో కొలువైన రాముడిని ఒంటరివాణ్ణి చేసింది!
ఈ వివాదంపై 19 ఏళ్ళ క్రితం సుప్రీం ఇచ్చిన ఉత్తర్వులే నేటికీ అక్కడ అమల్లో ఉన్నాయి. అక్కడ ఎలాంటి మతపరమైన క్రతువులూ, వేడుకలూ నిర్వహించరాదన్నది సుప్రీం ఆదేశాల సారాంశం. గత జనవరిలో అత్యున్నత న్యాయస్థానం ఇదే విషయమై యధాతథ స్థితి కొనసాగించాలంటూ స్టేటస్ కో కూడా ఇచ్చింది. దీంతో, కోదండపాణి అక్కడ కేవలం దీపారాధనకే పరిమితమయ్యాడు.