: నేనేమన్నా రేపిస్టునా?... నా పరువంతా పోయింది: యోగా గురువు
చస్తూ బతుకుతున్నానని భారతీయ అమెరికన్ వివాదాస్పద యోగా గురువు బిక్రమ్ చౌదరి వాపోతున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయన ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, తనను ఎంతో మంది ప్రేమిస్తారని అన్నారు. వాళ్లు తనను ఇష్టపడుతున్నంత మాత్రాన, దానిని అలుసుగా తీసుకుని అకృత్యాలకు పాల్పడే వ్యక్తిని కాదని ఆయన వెల్లడించారు. న్యాయవాదులు కొంతమందిని ఉసిగొల్పి తనపై లేనిపోని ఆరోపణలు చేయించారని ఆయన చెప్పారు. తనను ప్రేమించేవాళ్లుండగా అలాంటి తప్పుడు పనులు చేయాల్సిన అవసరమేమిటని ఆయన ప్రశ్నించారు. తన భార్య, పిల్లలు తన ముఖం చూడటం లేదని, పరువు ప్రతిష్ఠలు మసకబారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తికీ చావు తప్పదు, అయితే రేపిస్టు అంటూ చేసిన ఆరోపణల కారణంగా తాను ప్రతి రోజూ చస్తూబతుకుతున్నానని ఆయన కంటతడిపెట్టుకున్నారు. కాగా, ఆయన లైంగిక వేధింపులకు గురిచేసినట్టు ఆరుగురు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.