: ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే...రాష్ట్రపతి పాలన విధించాలి: చింతా మోహన్


శేషాచలం అడవుల్లో జరిగినది నకిలీ ఎన్ కౌంటర్ అని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్ ఆరోపించారు. శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ, ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనేనని అన్నారు. నిరుపేదలైన దళితులను కట్టేసి ఎన్ కౌంటర్ చేశారని ఆయన ఆరోపించారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తే ఇది నిజమైన ఎన్ కౌంటరా? లేక ఫేక్ ఎన్ కౌంటరా? అనేది తెలిసిపోతుందని ఆయన అన్నారు. ఎన్ కౌంటర్ జరిగింది ఖాళీ ప్రదేశంలో అని, ఖాళీ ప్రదేశానికి కూలీలు, స్మగ్లర్లు రారని ఆయన స్పష్టం చేశారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో వున్న ఎర్రచందనం దుంగలు పాతవని, అప్పుడే నరికిన దుంగలైతే నీరోడుతూ ఉంటాయని, ఈ దుంగలని చూస్తేనే పాతవని ఎవరైనా చెప్పగలరని ఆయన తెలిపారు. కేవలం పోలీస్ అధికారుల దుశ్చర్య కారణంగా నిరుపేదలైన దళిత కూలీలను ఎన్ కౌంటర్ చేసి చంపేశారని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో దళితులు నిర్భయంగా బతికే పరిస్థితి లేదని, తక్షణం ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. మానవహక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంటే, చూస్తూ ఉరుకోమని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News